Jump to content

లక్షద్వీప్

వికీపీడియా నుండి
లక్షద్వీప్ దీవుల పటం-1

లక్షద్వీప్ (ലക്ഷദ്വീപ്‌), భారతదేశంలో అతిస్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం.[1] ఈ దీవుల భూ విస్తీర్ణం మొత్తం 32 చదరపు కి.మీ, అరేబియా సముద్రములో, కేరళ తీరంనుండి 200 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.ఈ దీవులలో పది దీవులు మాత్రమే జనావాసం ఉన్న దీవులు. మిగిలిన 17 నిర్జీవ దీవులు. ఇవేకాక ఇంకా లెక్కలోకి తీసుకోని ఎన్నో చిన్న దీపఖండాలున్నాయి.లక్షద్వీప్ రాజధాని నగరం కవరట్టి నగరం.లక్షద్వీప్‌లో లక్షద్వీప్ జిల్లా అనే పేరుతో ఒకే ఒక జిల్లా ఉంది.

కవరట్టి, ఆగట్టి, మినీకాయ్, అమిని ప్రధానమైన దీవులు. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం ఈ కేంద్రపాలిత ప్రాంతం మొత్తం జనాభా 60,595. ఆగట్టిలో ఒక విమానాశ్రయం ఉంది. ఇక్కడికి కొచ్చిన్ నుండి నేరుగా విమాన సౌకర్యం ఉంది.[2]1973 వరకు, ఈ దీవుల సమూహం ఆంగ్లీకరించిన లక్కదీవ్స్ అనే పేరుతో పిలవబడేది. (సంస్కృతములో మాలద్వీపం అని పేరున్న మాల్దీవులుతో పోల్చండి). ఈ దీవుల ప్రజలు మళయాళ మాండలికమును మాట్లాడతారు. దాదాపు మొత్తం జనాభా ముస్లిం మతస్తులు. తమ పూర్వీకులు ఒక పెద్ద తుఫాను వలన సముద్రములో ఈ దీవులకు కొట్టుకువచ్చిన కొందరు వర్తకులని ఇక్కడి వాసుల నమ్మకం.

నామ చరిత్ర

[మార్చు]
లక్షద్వీప్ దీవుల పట-2

లక్షద్వీపాలు అంటే లక్ష అనే సంఖ్య అధారితంగా వచ్చిన పేరు.

చరిత్ర

[మార్చు]
లక్షద్వీప్ దీవుల ఉపగ్రహ చిత్రం

లక్ష ద్వీపాల గురించిన ప్రస్తావన మొట్టమొదటిగా తమిళ సాహిత్యమైన పురనానూరు లో ఉంది. ఇది పురాతన ద్రవిడదేశంలో ఒక భాగంగా ఉండేది. సంగకాల తమిళ సాహిత్య పరిశోధనలో ఈ ప్రాంతం చేర దేశ ఆధీనంలో ఉండేదని కనిగొనబడింది. 7వ శతాబ్దంలో పల్లవుల వ్రాలలో ఈ ద్వీపాలు పల్లవసామ్రాజ్యా ఆధీనంలో ఉన్నట్లు ప్రస్తావించబడింది. కేరళదేశపు చివరిరాజైన చేరమాన్ పెరుమాళ్ సమంలో ఈ ద్వీపాలకు సంబంధించిన మొట్టమొదటి ఒప్పదం జరిగినట్లు ప్రాంతీయ సంప్రదాయాలు, చరిత్ర, విశేషాలు తెలియజేస్తున్నాయి. ఈ ద్వీపసముదాయంలో అతిపురాతనంగా నివసించిన ద్వీపాలు వరుసగా అమిని, కల్పేని, ఆండ్రాట్ట్, కవరాట్టి, అగాట్టి. లక్షద్వీప నివాసులు మొదట హిందువులుగా ఉండి తరువాత సా శ 14వ శతాబ్దంలో ఇస్లామ్ మతస్థులుగా మారారు. ఏదిఏమైనప్పటికి సమీపకాలంలో జరిగిన పురాతత్వ పరిశోధనలలో సా.శ. 6-7 శతాబ్దాల మధ్య కాలములో బౌద్ధులతో ఒక ఒప్పాందం జరిగినట్లు ధ్రువీకరించబడింది. ఇక్కడ ప్రాబల్యమున్న సంప్రదాయాననుసరించి ఏ.డి 661 లో ఉబైదుల్లా అను అరబ్‌దేశీయుడు లక్షద్వీపాలకు ఇస్లామ్ మతాన్ని తీసువచ్చాడని భావించబడుతుంది. అతని సమాధి అండ్రోట్ ద్వీపములో ఉంది. సమాధి మీద ఏ.డి 756 తారీఖు వేసి ఉంది. 11వ శతాబ్దంలో ద్వీపవాసులు చోళ రాజుల పాలనలోకి వచ్చారు. 17వ శతాబ్దంలో ఈ ద్వీపాలు అలి రాజ్య (అరక్కల్ బీవి ఆఫ్ కానూరు) ఆధీనంలోకి వచ్చింది. దీనిని ఆమెకు కొలాతిరీలు బహుమతిగా ఇచ్చారు. పోర్చుగీసు వారు దీనిని స్వాధీనపరచుకొని కొబ్బరి పీచు ఉత్పత్తిని చేపట్టి ద్వీపవాసులు వారిని తరిమి కొట్టే వరకు ఉతప్పత్తిని కొనసాగించారు. ద్వీపవాసులు అరబ్ పర్యాటకుడు ఇబ్న్ బటువా గురించిన క్ధలను గొప్పగా వివరిస్తుంటారు.

1787 లో అమిందివి ద్వీపసముదాయం (ఆమిని, కాడ్మట్, కిల్తాన్, చెట్లత్, బిత్రా) టిప్పు సుల్తాన్ అధీనంలోకి వచ్చాయి. మూడవ ఆంగ్లో- మైసూరు యుద్ధం తరువాత ఈ ద్వీపాలు దక్షిణ కన్నడదేశంతో ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చాయి. మిగిలిన ద్వీపాలు కన్ననూరుకు చెందిన అరక్కల్ కుంటుంబంలో స్వాధీనంలో సామంతరాజ్యంగా ఉంటూ వచ్చింది. కప్పం కట్ట లేదన్న నెపంతో బ్రిటన్ ఈ ద్వీపసముదాయాలను తన ఆధీనంలోకి తీసుకుంది. బ్రిటిష్ కాలంలో ఈ ద్వీపాలు మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన మలబారు జిల్లాకు చెంది ఉన్నాయి.

అరేబియా సముద్రంలో దుర్భిణీ వేసి వెతికితే తప్ప కనిపించని ఈ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీ.పూ 1500 నాటికే ఉన్నాయి. బుద్ధుని జాతక కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది... అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారనే అనుకోవాలి. ఈ కథలన్నీ పుక్కిటి పురాణాలు అని కొట్టిపారేద్దామంటే చరిత్ర అధ్యయనానికి ప్రామాణిక గ్రంథం ‘పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ’ కూడా దీనినే నిర్ధారించింది. ఆ తర్వాత మధ్యయుగం నాటికి ఈ దీవులను చోళులు పాలించారు. కాలానుగుణంగా బ్రిటిష్ పాలనను రుచి చూసి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మన జాతీయ జెండా ఎగురవేయడంతో ఇండియాలో భాగమేనని ఖరారయ్యాయి ఈ దీవులు. స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దానికి కేంద్రపాలిత ప్రాంతంగా స్థిరపడింది ఈ దీవుల సమూహం.

స్వతంత్ర భారతం

[మార్చు]

1947 ఆగస్టు 15 న భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొద్ది రోజుల అనంతరమే భారతదేశానికి దూరంగా నివసిస్తున్న ఈ ద్వీపవాసులకు దేశస్వాతంత్ర్యం గురించిన సమాచారం తెలిసింది. నిజానికి స్వతంత్రం రావడానికి ఒక మాసం మునుపే మద్రాసు ప్రెసిడెన్సీ భారతదేశ స్వాధీనంలోకి వచ్చినప్పుడే లక్షద్వీపములూ దానంటదే భారతదేశ స్వాధీనంలోకి వచ్చాయి. ముస్లిమ్ జనాభా అధికంగా ఉన్న కారణంగా ఈ ద్వీపసమూహాలను పాకిస్థాన్ తన స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. అప్పటి ఉపప్రధాని అలాగే రక్షణమంత్రి అయిన ఉక్కుమనిషి అనిపించుకున్న సర్ధార్ వల్లాభాయ్ పటేల్ చేత పంపబడిన రాయల్ ఇండియన్ నేవీ లక్షద్వీపములకు చేరుకుని భారతదేశ జండాను లక్షద్వీపములో నాటి ఈ ద్వీపాల మీద భారతదేశ అధీనాన్ని ధ్రువపరిచి పాకిస్థాన్ చర్యలకు అడ్డుకట్ట వేసారు. భారతీయ యుద్ధనౌక చేరుకునే సమయంలో లక్షద్వీపాలకు సమీపంలో ఉన్న పాకిస్థాన్ కి చెందిన రాయల్ పాకిస్థాన్ నేవీ కి చెందిన యుద్ధనౌక వెనుదిరిగి కరాచీకి చేరుకుంది. 1956లో అధికంగా మళయాళీలు నివసిస్తున్న ఈ ద్వీపాలను స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ ఏక్ట్ ఆధారంగా ప్రధాన భూభాగం నుండి వేరు చేయబడి కొత్తగా ఒక యూనియన్‌గా రూపొందించబడ్డాయి.

భౌగోళికం

[మార్చు]

లక్షద్వీపాలు 12 పగడపు దీవులు, మూడు సముద్రాంతర్గత దిబ్బలు, ఐదు సముద్రంలో మునిగిన తీరాలు కలిగి ముప్పై తొమ్మిది ద్వీపాలు అతిస్వల్ప ద్వీపసముదాయాలు కలిగిన ద్వీపాలతో నిండిన సముద్రము. దిబ్బలు కూడా పగడపు దీవులే అయినప్పటికీ తీరాలు పూర్తిగా సముద్రంలో మునిగి వృక్షజాలం ఏమీలేని ఇసుక దిబ్బలే. మునిగిన తీరాలు పగడపు రాళ్ళతో నిండి ఉన్నాయి. అన్ని పగడపు రాళ్ళు అగ్నేయ, ఈశాన్య తీరాలలో చాలా వరకు తూర్పుతీరంలో ఆవృతమై ఉన్నాయి. అధికముగా మునిగి ఉన్న దిబ్బలు పడమటి దిశగా మడుగులతో నిండి ఉన్నాయి. ఈ ద్వీపాలలో 10 మానవ నివాసిత ద్వీపాలు. 17 మానవరహిత ద్వీపాలు, అతి చిన్న ద్వీప సముదాయాలు వీటి సమీపంలో ఉన్నాయి, 4 కొత్తగా ఏర్పడిన ద్వీపాలు, ఐదు మునుగిన దిబ్బలు. వీటిలో ప్రధాన దీవి అయిన కవరాట్టిలో లక్షద్వీప రాజధని నగరం అయిన కవరాట్టి నగరం ఉంది ఈ ద్వీపంతో ఆగట్టి, మినికాయ్, ఆమ్ని దీవుల మొత్తం జనాభా, 2011 జనాభా గణాంకాలను అనుసరించి 60,595. ఆగట్టిలో ఉన్న విమానాశ్రయం నుండి కేరళ లోని కొచ్చిన్ లేక ఎర్నాకుళం వరకు నేరుగా వెళ్ళే విమానాలు ఉన్నాయి.విదేశీ ప్రయాణీకులు ఈ ద్వీపాలను సందర్శించడానికి అనుమతి లేదు. ప్రస్తుత భారతదేశ మద్యపాన చట్టములను అనుసరించి లక్షద్వీప ద్వీపసముద్రములో మద్యపానము ఒక్క బెంగారామ్ ద్వీపంలో తప్ప మిగిలిన అన్ని ద్వీపాలలో నిషేధించబడింది.

అరేబియా సముద్రంలో ఆఫ్రికా - ఆసియా ఖండాల వ్యాపార మార్గంలో ఉన్నాయి లక్షద్వీప్ దీవులు. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా ఈ దీవుల మీదుగానే. వీటి పేరు లక్షదీవులు... అనే కానీ మనదేశంలోని యూనియన్ టెరిటరీల్లో చిన్నది ఇదే. భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లకు మించదు. ఒక మోస్తరు పెద్ద దీవులు 36 ఉన్నప్పటికీ పది దీవులే జనావాసాలు. పది సబ్ డివిజన్లతో ఒకే ఒక జిల్లా ఇది. జనాభా పది దీవుల్లో కలిసి 65 వేలకు మించదు. స్థానికుల్లో ఎక్కువ శాతం మలయాళీలే. అధికార భాష కూడా మలయాళమే, మినికోయ్ దీవిలో నివసించే వాళ్లు మాత్రం మహిల్ భాష మాట్లాడుతారు. ఇది మాల్దీవుల్లో మాట్లాడే భాష. ఈ దీవి మిగిలిన దీవుల సమూహానికి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. ఇక్కడి ప్రజల జీవనశైలి మిగిలిన దీవులకు భిన్నంగా ఉండదు, కానీ భాష వేరు.

భారతీయ పగడపు దీవులు

[మార్చు]

ది ఆమ్ని గ్రూప్ ద్వీపాలు (ఈ బృందంలో ఆమ్ని, కెల్టాన్, చెట్లత్, కడ్మాట్, బిత్రా, పెరుమాళ్), లక్షద్వీప దీవులు (వీటిలో ఆండ్రోత్, కల్పేని, పిట్టి, సుహేలి) ఈ రెండింటి మధ్య సముద్రాంతభాగ సంబంధం ఉంది. 200 కిలోమీటర్ల వెడల్పైన నైన్ డిగ్రీ కెనాల్ దక్షిణ భాగంలో ఉన్న మినికాన్ ద్వీపంతో ఉన్న ద్వీపాలన్నీ పగడపు రాళ్ళతో నిర్మితమై అలాగే పగడపు దిబ్బలతో భారతీయ పగడపు దీవులుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ద్వీపాలన్నీ పగడపు రాళ్ళతో నిండి తీరానికి సమీపంలో ఉన్నాయి. ఉత్తరంగా ఉన్న రెండు తీరాలు ఈ గ్రూప్ ద్వీపాలలో చేర్చబడ లేదు.

  • ఆంగ్రియా తీరం.
  • ఆడాస్ తీరం.

రాజకీయాలు

[మార్చు]

లక్షద్వీపాలన్నీ కలసి ఒక భారతీయజిల్లాగా రూపొందింది. కేంద్రప్రభుత్వం నియమించిన ప్రతినిధి నిర్వహణలో ఈ భారతీయ కేంద్రపాలిత ప్రాంతం పాలించబడుతుంది. ఈ కేంద్రపాలిత ప్రాంతం కొచ్చిన్ లోని కేరళా హై కోర్ట్ న్యాయవ్యవస్థకు చెంది ఉంది. ఈ ప్రదేశం మొత్తం ఒక లోక్‌సభ సభ్యుడిని ఎన్నికచేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ప్రాంతీయ ఎన్నికలు నిర్వహించబడడం లేదు. అయినప్పటికీ నిర్వాహము పంచాయితీ రాజ్‌తో చేరిన టూ-టైర్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తుంది. లక్షద్వీపాలలో 10 ఐలాండ్ కౌన్సిల్స్ పనిచేస్తున్నాయి. వీటిలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 79.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల అనుసరించి లక్షద్వీప జనసంఖ్య 64,429. మార్షల్ ద్వీపవాసులకు ఇది సరాసరి జన సంఖ్య. 640 భారతీయ శ్రేణులలో లక్షద్వీప జనసంఖ్య 627వ శ్రేణిలో ఉంది. ఈ జిలా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 2,013. లక్షద్వీప వైశాల్యం 5,210 చదరపు మైళ్ళు. ఈ దశాబ్ధపు (2001-2011) జనసంఖ్య వృద్ధిరేటు 6.23%. లక్షద్వీప స్త్రీపురుష నిష్పత్తి 946:1000. అక్షరాస్యత 92.28%. రాష్ట్రంలో ముస్లిం మతానికి చెందిన ప్రజలు 96.58% ఉన్నారు. ముస్లిం జనాభా లక్షద్వీప్‌లో మొత్తం జనాభాలో 64.47 వేలల్లో, 62.27 వేల (96.58 శాతం) ఉన్నారు లక్షద్వీప్‌లో క్రైస్తవ జనాభా మొత్తం 64.47 వేలల్లో 0.32 (0.49 శాతం) మంది ఉన్నారు.[3]

భాషలు

[మార్చు]

లక్షద్వీపాల భాషలు మలయాళము, జెసేరీ (ద్వీప్ భాషా). ఉత్తర ద్వీపవాసులు వారి వ్యాపార సమయాలలో తమిళం, అరబిక్ ప్రభావిత మళయాళ యాసతో మాట్లాడుతుంటారు. దక్షిణ ప్రాంత మినికాయ్ ప్రజలు మహ్ల్ భాషను మాట్లాడతారు. ఇది మాల్దీవులలో మాట్లాడే దివేహి భాషకు కొంతమార్పిడి చెందిన భాష. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో మళయాళ అక్షరాలతో కూడిన మళయాళ భాష అధికారిక భాషగా పరిచయము చేయబడింది. సమీపకాలముగా ఈ భాకు అరబిక్ ఒక విధమైన అక్షరాలను వాడుతున్నారు. ఈ విధానాన్ని భారతప్రభుత్వం కొనసాగిస్తుంది. మహ్ల్ భాషా ప్రభావితమైన మినికాయ్ ద్వీపంతో సహా లక్షద్వీపాల మధ్య అనుసంధిక భాషగా మళయాళ భాషను వాడుతుంటారు.

సంస్కృతి

[మార్చు]

లక్ష ద్వీపవాసులు సాంస్కృతింగా కేరళా సముద్రతీర ప్రాంత ప్రజలను పోలి ఉంటారు. అలాగే అరబ్ వ్యాపారులచేత ప్రభావితులై ఉంటారు. దక్షిణ ప్రంతంలో ఉన్న అలాగే ద్వితీయస్థానంలో ఉన్న మినికాయ్ వాసులైన దివేహీలు ఇక్కడి స్థానికులుగా భావించబడుతున్నారు. ఈ దివేహీ సమూహాలు, ఉప దివేహీలు కొన్ని సందర్భాలలో మహ్లాస్. దేశీయంగా జనాభాపరంగా అధికులు సున్నీ ముస్లీములు. మినికాయ్ వాసులు తప్ప మిగిలిన దివి లేక ఆమ్నిదివీలు. లక్షద్వీపవాసులు సాంస్కృతిక సమూహాలు 84.33% మలయాళీలు, 15,67% మహ్లాస్.

మినికాయ్ ద్వీపం

[మార్చు]

మినికాయ్ ద్వీపం లక్షద్వీప్ ప్రాంత దక్షిణ-అత్యంత ద్వీపం, ఇది కొచ్చికి నైరుతి దిశలో 398 కిమీ (215 నాటికల్ మైళ్ళు) దూరంలో 8° 15′, 8° 20′ N అక్షాంశం, 73° 01′, 73° OS మధ్య ఉంది. 'E రేఖాంశం, 4.80 చదరపు కి.మీ. ఈ ద్వీపం 9 0 ఛానల్ సమీపంలో ఉంది. ఇది అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ మార్గాలలో ఒకటి. ఇది ఉత్తర-అత్యంత మాల్దీవుల ద్వీపానికి 130 కి.మీ దూరంలో ఉంది. ఇది పడమటి వైపున చాలా పెద్ద మడుగును కలిగి ఉంది, రెండు ప్రవేశాల ద్వారా సుమారు 6 కి.మీ., ఒకటి పశ్చిమాన, మరొకటి ఉత్తర-అత్యంత ప్రదేశంలో ఉంటుంది. మడుగు ప్రాంతం 30.60 చ.కి.మీ. ఈ ద్వీపం పడమటి వైపున సగటు సముద్ర మట్టానికి 2 మీ. తూర్పు వైపు 3 నుండి 4 మీటర్ల ఎత్తులో ఉంది మరియు పొడవు 11 కి.మీ. ఈ ద్వీపంలోని లైట్ హౌస్ పురాతనమైంది 1885లో నిర్మించబడింది. బీచ్‌లలో స్నానపు గుడిసెలు, బట్టలు మార్పు గదులు ఉన్నాయి; కాబట్టి ఈత, బీచ్ వాక్, పెడల్ బోట్, కయాక్ మరియు సెయిల్. వీటిని కిరాయికి అందిస్తారు. బస చేసే పర్యాటకుల కోసం మూడు టూరిస్ట్ కాటేజీలు, ఒక 20 పడకల పర్యాటక గృహాలు నిర్మించబడ్డాయి.[4]

జీవావరణ శాస్త్రం

[మార్చు]

లక్షద్వీప సముద్రతీర ప్రాంతాలు మాల్దీవులకు చాగోస్ దీవులను పోలి ఉంటుంది. లక్షద్వీప మడుగులు, కొండపగుళ్ళు, సముద్రతీరాలు పలు విధముల సముద్రతీర జీవజాలానికి విలసిల్లడానికి అనుకూల వాతావరణం కలిగి ఉంటుంది. వీటిలో జీవమున్న పగడపు కొండలు, సముద్రపు అర్చిన్స్, సముద్రపు పాచి, సముద్రపు దోసకాయలు, నక్షత్ర చేపలు, కఒరీలు, క్లామ్స్,, అక్టోపసులు ఉంటాయి. సీతాకోక చేపల వంటి అనేకరకాల చేపలు మొరే ఈల్స్, లాగూన్ (మడుగు) ట్రిగ్గర్ ఫిష్ అలాగే మరికొన్ని ఉన్నాయి. నివాసయోగ్యం కాని చర్బానియన్, బైరమ్‌గోర్ కొండ పగులు, పెరుమాల్ పార్ అలాగే పిట్టీ పాల్ ద్వీపం మొదలైనవి సముద్రపు టర్టిల్స్, బ్రౌన్ నొడ్డీ, లెసర్ క్రెస్టెడ్ టర్న్, గ్రేటర్ క్రెస్టెడ్ టర్నులు మొదలైన సముద్రపు పలు పక్షులు సంతానోత్పత్తి కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. పలురకములైన ట్యూనా, వాహూ, స్వోర్డ్ ఫిష్ (కత్తి చేపలు), డాల్ఫిన్స్ వంటివి ఈ ద్వీపతీర సముద్రంలో సాధారణంగా కనిపిస్తుంటాయి. సుహేలీ పార్ వద్ద ఉన్న సముద్రతీర ప్రాణుల పుష్కలత కారణంగా ఈ ప్రాంతాన్ని మేరిన్ నేషనల్ పార్క్ గా ప్రకటించబడింది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-04-14. Retrieved 2020-12-06.
  2. https://www.mapsofindia.com/flight-schedule/kochi-agatti.html
  3. "Lakshadweep Religion Data - Census 2011". www.census2011.co.in. Retrieved 2020-12-06.
  4. "Minicoy | Lakshadweep | India". Retrieved 2024-02-06.

బయటి లింకులు

[మార్చు]